2027 నుంచి కొత్త 'కేఫ్' నిబంధనలు.. ఆటోమొబైల్ రంగానికి కేంద్రం భారీ ఊరట

దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. 2027 నుంచి 2032 మధ్య కాలానికి వర్తించే కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ (CAFE) నిబంధనలను సడలిస్తూ కొత్త ముసాయిదాను విడుదల చేసింది. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ)తో సంప్రదింపులు జరిపి విద్యుత్ మంత్రిత్వ శాఖ ఈ సవరించిన ముసాయిదాను సిద్ధం చేసింది. గతంలో ప్రతిపాదించిన కఠినమైన లక్ష్యాల స్థానంలో దశలవారీగా నిబంధనలను కఠినతరం చేసే విధానాన్ని ప్రభుత్వం ఎంచుకుంది.

'కేఫ్-2027'గా పిలిచే ఈ కొత్త నిబంధనలు 2027 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. 2032 ఆర్థిక సంవత్సరం వరకు క్రమంగా వీటిని కఠినతరం చేస్తారు. దేశ వాతావరణ, ఇంధన లక్ష్యాలకు అనుగుణంగా ఆటోమొబైల్ రంగాన్ని తీర్చిదిద్దే ప్రణాళికలో ఇది మూడో దశ. గతంలో 2025 సెప్టెంబర్‌లో విడుదల చేసిన ముసాయిదాతో పోలిస్తే తాజా ఫ్రేమ్‌వర్క్‌లో కంపెనీలకు మంచి వెసులుబాటు కల్పించారు.

కొత్త ముసాయిదాలో ఉద్గారాల లెక్కింపునకు సంబంధించిన ఫార్ములాను మార్చారు. దీనివల్ల గతంలో ప్రతిపాదించిన దానికంటే వాహనాలు కొంచెం ఎక్కువ ఇంధనాన్ని వినియోగించుకోవడానికి వీలు కలుగుతుంది. బరువైన వాహనాలకు గతంలో ఉన్న ప్రయోజనాన్ని తగ్గిస్తూ, అన్ని రకాల వాహనాలకు దాదాపు ఒకే విధమైన నిబంధనలను తీసుకురావడం ఈ ముసాయిదాలోని మరో ముఖ్యమైన అంశం.

ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు పెద్దపీట
ఈ కొత్త నిబంధనల్లో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలకు ప్రభుత్వం భారీగా ప్రోత్సాహం కల్పించింది. ఈ వాహనాలకు సూపర్ క్రెడిట్స్ ఇచ్చారు. దీని ప్రకారం ఒక కంపెనీ ఫ్లీట్ ఉద్గారాలను లెక్కించేటప్పుడు ఒక ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ కారును ఒకటి కంటే ఎక్కువ వాహనంగా పరిగణిస్తారు. ప్లగ్-ఇన్ హైబ్రిడ్, ఫ్లెక్స్-ఫ్యూయల్ హైబ్రిడ్ వాహనాలకు ఇంకా అధిక మల్టిప్లయర్‌లు లభించనున్నాయి.

ఇదే సమయంలో తయారీదారుల మధ్య 'క్రెడిట్ ట్రేడింగ్'కు కూడా అనుమతి ఇచ్చారు. దీని ద్వారా నిర్దేశిత లక్ష్యాలను మించి ఉద్గారాలను తగ్గించిన కంపెనీలు, తమ అదనపు క్రెడిట్లను లక్ష్యాలను చేరుకోలేని ఇతర కంపెనీలకు విక్రయించుకోవచ్చు. అయితే, నిబంధనలు పాటించని పెద్ద కంపెనీలపై వందల కోట్ల రూపాయల జరిమానాలు విధించే అవకాశం ఉందని ముసాయిదా స్పష్టం చేస్తోంది. మరోవైపు ఏటా 1,000 కంటే తక్కువ యూనిట్లను ఉత్పత్తి చేసే చిన్న కంపెనీలకు ఈ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు. మొత్తంమీద పర్యావరణ లక్ష్యాలను కాపాడుతూనే ఆటో పరిశ్రమకు వెసులుబాటు కల్పించేలా ఈ కొత్త ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించారు.

CAFE
Corporate Average Fuel Efficiency
Automobile Industry
Electric Vehicles
Hybrid Vehicles
Fuel Efficiency
Auto Industry India
Ministry of Power
Bureau of Energy Efficiency
Vehicle Emissions

More Telugu News